“అతి శబ్దం చేస్తే అంతే సంగతులు: ఒక్క రోజే 182 కేసులు, రూ. 2.44 లక్షల జరిమానా.|

0
11

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర రోడ్లపై అతి శబ్దంతో ప్రయాణిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్ల వాడకంపై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో ఏప్రిల్ 20న నియోజకవర్గవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ప్రధాన జంక్షన్ల వద్ద రణగొణ ధ్వనులు చేస్తూ వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా, భారీగా ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఒక్కరోజే 182 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, వారి నుండి మొత్తం రూ. 2,44,000 జరిమానా వసూలు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 36 మోడిఫైడ్ సైలెన్సర్లను వాహనాల నుండి అక్కడికక్కడే తొలగించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. శబ్ద కాలుష్యం కలిగించే ఇలాంటి సైలెన్సర్లు మరియు ప్రెషర్ హారన్ల వల్ల వృద్ధులు, రోగులు మరియు చిన్న పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వాహనదారులు కేవలం కంపెనీ అందించిన ప్రామాణిక సైలెన్సర్లను మాత్రమే వాడాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఒకవేళ రెండోసారి కూడా అదే వాహనం మోడిఫైడ్ సైలెన్సర్‌తో పట్టుబడితే, సదరు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నేరుగా కోర్టుకు పంపుతామని స్పష్టం చేశారు.

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, శబ్ద కాలుష్య నియంత్రణకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

#sidhumaroju