“కన్నబిడ్డను వెతికిచ్చిన దేవుళ్లు.. అల్వాల్ పోలీసుల అంకితభావానికి సెల్యూట్!

0
19

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కళ్లముందే ఆడుకుంటున్న కన్నబిడ్డ మాయమైతే ఆ తల్లిదండ్రుల గుండె ఆగిపోయినంత పనైంది. కానీ అల్వాల్ పోలీసులు కేవలం 45 నిమిషాల్లోనే ఆ చిన్నారిని సురక్షితంగా వెతికి పట్టుకుని, తమలోని మానవీయ కోణాన్ని మరియు వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

లోతుకుంట, లక్ష్మీనగర్ కాలనీలో నివసించే ప్రవీణ్ కుమార్ పురోహిత్ కుమారుడు మయూర్ పురోహిత్ (7 ఏళ్లు). ఒకటో తరగతి చదువుతున్న ఈ చిన్నారి, సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో వెంకట్రావుపేట్, ఇందిరా నగర్ (వెంకటాపురం) వద్ద ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తక్షణమే పోలీసులను ఆశ్రయించారు.

ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ చొరవ – యుద్ధ ప్రాతిపదికన గాలింపు.

బాధితుల ఆవేదనను చూసిన ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆ చిన్నారిని తమ ఇంటి బిడ్డగా భావించి మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఎస్ఐ చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందాలు గాలి వేగంతో కదిలాయి. ఇందిరా నగర్ పరిసరాల్లోని ప్రతి సందును, 30కి పైగా సీసీటీవీ కెమెరాలను సెకన్ల వ్యవధిలో స్కాన్ చేశారు.

బాలుడు మిలిటరీ డైరీ ఫాం రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు, పది నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నారు. సరిగ్గా 45 నిమిషాల్లో శోభా గార్డెన్స్ సమీపంలో ఒంటరిగా ఉన్న మయూర్‌ను సురక్షితంగా గుర్తించి అక్కున చేర్చుకున్నారు.

చిన్నారిని భద్రంగా తీసుకువచ్చి ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్, ఎస్ఐలు లఖన్ రాజ్, చంద్రశేఖర్ బృందం తల్లిదండ్రులకు అప్పగించింది. తమ బిడ్డను క్షేమంగా చూసుకున్న ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆనంద బాష్పాలు పోలీసుల మనసు గెలుచుకున్నాయి.

“పోలీసులు అంటే కేవలం కఠినంగా ఉండటం కాదు.. ఆపదలో ఉన్నవారికి ప్రాణం పోయడం” అని అల్వాల్ పోలీసులు మరోసారి నిరూపించారు. సకాలంలో స్పందించి తమ బిడ్డను కాపాడిన పోలీసులకు ఆ కుటుంబం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపింది.

#sidhumaroju

Alwal