మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై దాడులకు దిగారు.. కట్ చేస్తే, అసలు విషయం బయటపడి ఇప్పుడు పోలీసుల కటకటాలపాలయ్యారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని నమ్మిస్తూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు నకిలీ మహిళా అధికారులను మంగళవారం అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
ఓల్డ్ అల్వాల్ ఐజీ ప్రాంతంలోని ఒక స్వీట్ షాపులోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు, తాము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని పరిచయం చేసుకున్నారు.
దుకాణంలో తనిఖీలు చేస్తున్నట్లు నటిస్తూ, యజమానిని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.
అయితే, వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్వీట్ హౌస్ యజమాని చాకచక్యంగా వ్యవహరించారు. వెంటనే స్థానిక అసలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మి కాంత్ కు సమాచారం అందించారు.
చేరుకున్న అధికారి, ఆ మహిళలను నిలదీశారు. ఐడెంటిటీ కార్డులు చూపాలని కోరగా.. “మేము ప్రైవేట్ ఫుడ్ ఆఫీసర్లం, మాది ప్రైవేట్ సంస్థ” అంటూ పొంతన లేని సమాధానాలు చెబుతూ బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు ఆ ఇద్దరు కిలాడీ మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఎవరైనా తనిఖీల పేరుతో వస్తే వారి ఐడెంటిటీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ అధికారుల ఆటలు సాగనివ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.
#sidhumaroju
Alwal










