“సమ్మే హారన్ “స్తంభించిన చక్రం.. డిపోలకే బస్సులు!”

0
4

సికింద్రాబాద్  : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో సికింద్రాబాద్‌ పరిధిలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

జూబ్లీ బస్ స్టేషన్ వేదికగా కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేయడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పికెట్, కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలకు చెందిన బస్సులు రోడ్డుపైకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లాల్సిన సర్వీసులు రద్దు కావడంతో బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించాలని వారు కోరారు.

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, పనిచేస్తున్న వారికి పీఆర్సీని అమలు చేయాలని వారు స్పష్టం చేశారు.

ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు అధికారులతో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని, అందుకే గత్యంతరం లేక సమ్మె నోటీసు ఇచ్చి ప్రత్యక్ష పోరాటానికి దిగినట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.

#sidhumaroju

Alwal