హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్లో జూన్ 2న ఈ సభను నిర్వహించేందుకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేపట్టగా, భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో జరగనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం ఆ వేడుకల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అదే రోజు పెద్ద ఎత్తున రాజకీయ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ రద్దీతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అభిప్రాయపడిన అధికారులు సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన నాయకత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. సభ నిర్వహణకు అనుమతి కల్పించాలని కోరుతూ పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో పార్టీ విస్తరణ లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నామని జనసేన వర్గాలు చెబుతుండగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
#sidhumaroju










