ఆసిఫాబాద్ (కుమరం భీమ్ జిల్లా):కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి మరో క్రీడా కెరటం మెరిసింది. ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు బాదావత్ శ్రీ చంద్ నాయక్ ప్రతిష్టాత్మక ‘నేషనల్ క్రికెట్ లీగ్’ (National Cricket League) కు ఎంపికయ్యాడు.ప్రతిభ చాటిన శ్రీ చంద్ హైదరాబాద్‌లోని సెంచూరియన్ మైదానంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అండర్-16 (U-16) క్రికెట్ క్రీడాకారుల కోసం మూడు రోజుల పాటు ఎంపిక పోటీలు (ట్రయల్స్) నిర్వహించారు.
ఈ సెలెక్షన్స్‌లో శ్రీ చంద్ నాయక్ అద్భుతమైన ప్రతిభను కనబర్చి సెలెక్టర్ల ప్రశంసలు అందుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనతో నేషనల్ లీగ్‌కు తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. బాబాపూర్ గ్రామానికి చెందిన బాదావత్ శివప్రసాద్, రజిత దంపతుల చిన్న కుమారుడైన శ్రీ చంద్ నాయక్ జాతీయ స్థాయి లీగ్‌కు ఎంపిక కావడం పట్ల స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి, అదీ ఒక గిరిజన యువకుడు జాతీయ స్థాయికి ఎంపికవడం గర్వకారణమని గ్రామస్తులు శ్రీ చంద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.







