చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన అఖిల్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొల్లూరు జలపాతాన్ని సందర్శించడానికి వచ్చాడు. అందరూ కలిసి జలపాతం అందాలను ఆస్వాదిస్తూ, నీటిలో కేరింతలు కొడుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. అఖిల్ ప్రమాదవశాత్తు జలపాతంలోని లోతైన నీటి గుండంలో పడి మునిగిపోయాడు.
కళ్లముందే అఖిల్ నీటిలో మునిగిపోతుండడం గమనించిన స్నేహితులు వెంటనే అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. నీటిలో మునిగి ఊపిరాడక అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు నిర్ధారించారు.కళ్లముందే ప్రాణస్నేహితుడు శవంగా మారడంతో తోటి స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొతుగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.










