మహిళా క్రీడాకారిణులకు ‘శక్తి టీం’ శక్తి యాప్ పై అవగాహన

0
0

చీరాల,

మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ గారు ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ మోయిన్ గారు సూచనలతో.. చీరాల పట్టణ రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేడియంలో జరుగుతున్న ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలకు విచ్చేసిన మహిళా క్రీడాకారిణులకు శక్తి టీం కానిస్టేబుల్ సిహెచ్. సునీత మహిళల భద్రత, యాప్‌ల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా శక్తి టీం కానిస్టేబుల్ సునీత మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, విద్యార్థినులు ప్రయాణాలు చేసే సమయంలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులు ఎదురైనా అధైర్యపడకూడదని సూచించారు.

ప్రతి మహిళా తమ మొబైల్‌లో ‘శక్తి యాప్’ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె కోరారు. అత్యవసర సమయాల్లో లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్ అన్‌లాక్ చేయకపోయినా యాప్ ద్వారా మొబైల్‌ను కేవలం గట్టిగా ఊపడం చేస్తే చాలు, తక్షణమే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందని, నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కల్పిస్తారని క్రీడాకారిణులకు ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణులు, నిర్వాహకులు పాల్గొన్నారు. క్రీడాకారిణిలందరకు శక్తి టీం కృతజ్ఞతలు తెలిపారు.