హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి,
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం స్మశానవాటిక అభివృద్ధి, నిర్వహణతో పాటు సర్వే నెం.18లో ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటు అంశాలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ముస్లిం సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
మంత్రి అజారుద్దీన్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, యూసుఫ్ నగర్‌లోని ముస్లిం స్మశానవాటికను అల్లాపూర్ డివిజన్ ప్రజలకే కేటాయించాలని, అక్కడ సరైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కోరారు. అదేవిధంగా సర్వే నెం.18లో ఉర్దూ మెడికల్ స్కూల్‌ను ఏర్పాటు చేసి మైనారిటీ వర్గాలకు వైద్య, విద్యా రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, సమస్యలను సమగ్రంగా పరిశీలించి త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశం ద్వారా అల్లాపూర్, యూసుఫ్ నగర్ ప్రాంతాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.










