MAHABUBABAD:: మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.మంగళవారం అర్ధరాత్రి తన ఇంటి ముందు వరండాలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి కిరాతకంగా హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, యాకయ్య ప్రతిరోజులాగే మంగళవారం రాత్రి ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా దుండగులు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు యాకయ్య రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్యకు వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలు, ఆస్తి వివాదాలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.









