ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా, ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 10,120 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. గతంలో ఉన్న పరిమితులను తొలగించి, ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ప్రత్యేకత. ఈసారి గ్రామీణ అంగన్‌వాడీల పిల్లలను కూడా లబ్ధిదారులుగా చేర్చారు. అడ్మిషన్లు పూర్తకాని వారికి ఆగస్టులో నిధులు అందజేస్తారు. ‘మనమిత్ర’, ‘లీప్’ యాప్ల ద్వారా అర్హులు వివరాలు చూసుకోవచ్చు. చదువుకునే ప్రతి బిడ్డకు భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.










