మదనపల్లె: ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా, పరిపాలనా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
సీఎం సెక్యూరిటీ అదనపు ఎస్పీ ఆర్.పి.ఎల్. శాంతికుమార్, డీఎస్పీ కె. శివ పోతురాజు, ఐఎస్డబ్ల్యూ అధికారులతో కలిసి హెలిప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.










