ఇసుకనూతపల్లి: గంజాయిపై పోలీసుల అవగాహన సదస్సు|

0
0

మదనపల్లె: మదనపల్లె రూరల్ పరిధిలోని ఇసుకనూతపల్లి పంచాయతీలో తాలూకా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలను ఉద్దేశించి పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

 

అలాగే అత్యవసర పరిస్థితులు లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు పాత డయల్-100కు బదులుగా 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని ప్రజలకు వివరించారు. ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, పోలీసులతో సహకరించి నేరాల నియంత్రణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.