Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు, పశుపక్షాదులు నీటి సమస్యల నుంచి గట్టెక్కాలని ఆకాంక్షిస్తూ మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్ 34వ వార్డులో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు, 34వ వార్డు ఇన్‌చార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇన్‌చార్జ్ స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా బాలమలి శేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులు తొలగి, చెరువులు, కుంటలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని తెలిపారు. రైతుల కష్టాలు తీరాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండేలా సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నామని చెప్పారు.
35వ వార్డు ఇన్‌చార్జ్ స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు










