అర్హులందరికీ ఓటు హక్కే లక్ష్యం: డీసీసీ ఆత్రం సుగుణక్క|

0
12

జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్‌లో పర్యటించిన ఆమె, కొమురం భీం విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జోడేఘాట్, పట్నాపూర్, బాబెఝరి తదితర గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SSR) ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని బీఎల్ఓలు, కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ వెళ్లి నిశితంగా సర్వే చేయాలని, ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలన్నారు. సర్వే పూర్తయ్యే వరకు కాంగ్రెస్ శ్రేణులు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.