పేదల భూములపై ఆంక్షలా.. ప్రభుత్వంపై ఈటల ఫైర్.|

0
7

● 22-A బాధితులకు అండగా ఇందిరాపార్క్‌లో బీజేపీ మహా దీక్ష

● అర్హులైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్

● మల్కాజిగిరి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న ఈటల రాజేందర్

ఆల్వాల్, సెప్టెంబర్ 5: 22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, నివాస ప్రాంతాలను ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన మహా దీక్షకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 22-A బాధితులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 22-A సమస్యతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వేదన అనుభవిస్తున్నారని అన్నారు.

తమ భూములు, ఇళ్లు నిషేధిత జాబితాలో ఉండటంతో వాటిని విక్రయించుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

22-A చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని తాము డిమాండ్ చేయడం లేదని, అర్హత ఉన్న పేదలు, రైతులు, కాలనీవాసుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మాత్రమే కోరుతున్నామని ఈటల స్పష్టం చేశారు. ప్రజల అభ్యంతరాలను స్వీకరించి, రికార్డులను పరిశీలించి, తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన భూములను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలోని అనేక కాలనీల ప్రజలు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, బాధితులు స్వచ్ఛందంగా బస్సులు ఏర్పాటు చేసుకుని ఇందిరాపార్క్‌కు తరలివచ్చారని ఈటల పేర్కొన్నారు. ప్రజల ఆస్తులపై హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తమ ఇళ్లు, స్థలాల విషయంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈటల ఆరోపించారు.

గిరినగర్, ఫణిగిరి కాలనీ, గజులరామారం, మహేంద్రహిల్స్, అస్మత్‌పేట తదితర ప్రాంతాల్లో భూములు, ఇళ్లకు సంబంధించిన సమస్యలను ఆయన ప్రస్తావించారు. ప్రజల ఆస్తుల విషయంలో అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు.

హైడ్రా చర్యలు, ధరణి, భూభారతి భూ రికార్డుల వ్యవహారంపైనా ఈటల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో పనిచేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

22-A సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఈటల రాజేందర్ తెలిపారు. అవసరమైతే బాధితుల తరఫున న్యాయపోరాటంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించేందుకు కూడా వెనుకాడబోమని అన్నారు.

అర్హులైన ప్రజల భూములు, ఇళ్లను నిషేధిత జాబితా నుంచి తొలగించి వారికి పూర్తి హక్కులు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal