● యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం
● వైద్యులతో చికిత్స వివరాలు తెలుసుకున్న మాజీ సీఎం
● అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని వెల్లడించిన డాక్టర్లు
హైదరాబాద్, జూలై 27: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా వైద్యులను కలిసి చికిత్స కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సుమారు అరగంట పాటు ఆస్పత్రిలోనే ఉండి వైద్యులతో మాట్లాడిన కేసీఆర్.. అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
“ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి” అంటూ వైద్యులను కేసీఆర్ కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేవుడిపై నమ్మకం ఉంచాలని, వైద్యులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మరికొంత సమయం అవసరమని వైద్యులు కేసీఆర్కు వివరించినట్లు సమాచారం.
ఐసీయూలో అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం కేసీఆర్, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.
#Sidhumaroju










