🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని బాబాపూర్ గ్రామంలో పోలాల అమావాస్య పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రైతులు తమ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచే పశువుల పట్ల కృతజ్ఞతగా ఈ పూజలను ఘనంగా నిర్వహించారు.పండుగ సందర్భంగా ఉదయాన్నే రైతులు తమ ఎద్దులను, ఆవులను శుభ్రంగా కడిగి.. కొమ్ములకు రంగురంగుల రంగులు వేసి, పూలదండలు, గంటలతో ముస్తాబు చేశారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి, పశువులకు ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు, నైవేద్యాలను తినిపించారు. పశువులతో పాటు వ్యవసాయానికి ఉపయోగించే నాగలి, కాడి వంటి పనిముట్లకు కూడా రైతులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. రాబోయే కాలంలో పంటలు సమృద్ధిగా పండాలని, పశువులన్నీ ఆరోగ్యంగా ఉండాలని రైతులు ఆకాంక్షించారు.










