● డీసీపీలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీ గణేష్
● ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై చర్చ
● ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా సమన్వయం
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 27: వరుసగా జరగనున్న బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులతో చర్చించారు.
ఈ మేరకు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే.. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలపై సమీక్షించారు.
ఆలయాల వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని డీసీపీ శ్రీధర్‌తో చర్చించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, భక్తుల వాహనాలకు అనుకూలంగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించాలని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డితో చర్చించారు.
బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, ఇతర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ కోరారు.
#Sidhumaroju










