ఆసిఫాబాద్‌లో ఉధృతంగా తుంపల్లి వాగు.. కలెక్టర్ పరిశీలన|

0
93

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగు కాజ్‌వే పైనుండి అత్యంత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వాగు ఉధృతికి పరివాహక ప్రాంతాల్లోని పలు గిరిజన గూడాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వంతెన వద్ద గట్టి పహారా ఏర్పాటు చేసి, ఇరువైపులా వాహనాలను నిలిపివేశారు. ప్రజలు, వాహనదారులు ఎవరూ ప్రాణాలకు తెగించి వరద ప్రవాహంలో వాగు దాటే సాహసం చేయవద్దని అధికారులు హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని క్షేత్రస్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.