మహంకాళి సన్నిధిలో సీపీ సజ్జనర్ ఐపీఎస్.|

0
17

● లాల్‌దర్వాజా మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణలో పాల్గొన్న సీపీ

● నగర ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు

● లాల్‌దర్వాజా బోనాలకు పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు

● ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు ప్రజలకు సీపీ విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 31: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ మహోత్సవాల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ పాల్గొన్నారు.

అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర ప్రజలందరిపై శ్రీ మహంకాళి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు సీపీ తెలిపారు.

120 ఏళ్లకు పైగా చరిత్ర, విశిష్ట ఆధ్యాత్మిక ప్రాశస్త్యంతో లాల్‌దర్వాజా బోనాలు హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు.

గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, లాల్‌దర్వాజాకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ తరఫున సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా, వైభవంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju