బాధితుల్ని గాలికొదిలి నిందితుడికి పరామర్శనా?: లోకేష్|

0
0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో బాధితుడి కుటుంబాన్ని విస్మరించి, నిందితుడి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఇది పరామర్శ కాదని, నేరపూరిత మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు.

 

విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన గొర్రెల కాపరి డి. దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, అయితే జగన్ మాత్రం బాధితులను వదిలి నిందితుల పక్షాన నిలిచారని లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన #PsychoFekuJagan, #YcpCriminalPolitics అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు.

 

గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్ మోహన్ రెడ్డి, హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసేందుకు వెళ్లారు. అయితే, ఆయన సాయంత్రం 5 గంటల తర్వాత చేరుకోవడంతో జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో జైలు వెలుపల అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి జగన్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సాధారణ ప్రమాద ఘటనను హత్య కేసుగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.