అమరావతి, ఆగస్టు 8: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాదచారుల భద్రత, సార్వత్రిక అందుబాటును లక్ష్యంగా చేసుకుని 2026 పాదచారుల భద్రత, యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీని నోటిఫై చేసింది. దేశంలో పాదచారుల భద్రత కోసం ప్రత్యేక సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విధానంలో సురక్షిత ఫుట్‌పాత్‌లు, పాదచారుల క్రాసింగ్‌లు, రోడ్డు భద్రతా ఆడిట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు సహా అందరికీ సురక్షితమైన రహదారులను కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రహదారులతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల అభివృద్ధిలోనూ ఈ మార్గదర్శకాలను అమలు చేయనున్నారు. పాదచారుల మౌలిక వసతులపై పర్యవేక్షణకు సాంకేతికతను వినియోగించనున్నారు. స్థానిక సంస్థలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించి నడక మార్గాలను అడ్డంకులు లేకుండా నిర్వహించనున్నారు.










