🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండల పోలీసులు మెరుపు దర్యాప్తుతో ఒక చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించి తమ చాకచక్యాన్ని నిరూపించుకున్నారు. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం కొత్త రాహపల్లి గ్రామానికి చెందిన లలిత అనే మహిళ వ్యవసాయ పనుల నిమిత్తం తన ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లారు.
అదే గ్రామానికి చెందిన వడై లాలాజీ అనే వ్యక్తి ఇల్లే లక్ష్యంగా చేసుకుని లోపలికి చొరబడ్డాడు. ఇంట్లోని అల్మారా తాళం పగులగొట్టి, అందులో ఉన్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
సీఐ రవి గారి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితుడు వడై లాలాజీని గుర్తించి అదుపులోకి తీసుకుంది. అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి చోరీకి గురైన 38.320 గ్రాముల బంగారు నగలను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు.నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రవి గారు అధికారికంగా ప్రకటించారు. ఫిర్యాదు అందిన రోజే స్పందించి, తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకుని బంగారు ఆభరణాలను రికవరీ చేసిన పోలీసుల పనితీరుపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.










