బొల్లారం మిలిటరీ బేస్‌లో ఆయుధాల చోరీ కేసు ఛేద్యం.|

0
30

• మాజీ హవిల్దార్‌తో సహా ఎనిమిది మంది అంతరాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్

• ఆగస్టు 31న చోరీ జరిగితే.. సెప్టెంబరు 11 నుండి రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు

• 4 AK-203 రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిల్, పిస్టళ్లు, 1900 పైగా బుల్లెట్లు స్వాధీనం

• భారీ దోపిడీల కోసమే స్కెచ్.. ఉగ్రవాద లింకులు లేవని బి.సుమతి ఐపీఎస్ స్పష్టత

అల్వాల్, అక్టోబరు 3: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం మిలిటరీ ఏరియాలో జరిగిన అత్యాధునిక ఆయుధాల దొంగతనం కేసును పూర్తిగా ఛేదించినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి ఐపీఎస్ అధికారికంగా ప్రకటించారు.

ఆగస్టు 31న ఈ చోరీ ఉదంతం వెలుగుచూసినప్పటి నుండి నిరంతరాయంగా దర్యాప్తు జరిపిన ప్రత్యేక బృందాలు, ఈ అంతరాష్ట్ర ఆయుధాల దొంగతనం ముఠాకు సూత్రధారి అయిన రిటైర్డ్ హవిల్దార్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుండి భారీగా ఆయుధాలను రికవరీ చేసినట్లు కమిషనర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఉప్పుతోళ్ల మల్లేష్ @ రాజు (37), గతంలో మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌లో హవిల్దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. 

ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కి, బ్యాంకులు మరియు పెద్ద జ్యువెలరీ షాపుల్లో భారీ దోపిడీలు చేయడానికి ఈ మాజీ హవిల్దార్ తన పాత సహచరులైన సిపాయిలు ఎ2 నిందితుడు శేషులు, ఎ3 నిందితుడు వినోద్ కుమార్, ఎ4 నిందితుడు హవిల్దార్ ప్రవీణ్‌ల సహాయంతో గత ఆగస్టు 31న బొల్లారం ఆయుధాగారం తాళాలు పగలగొట్టి ఆయుధాలను దొంగిలించాడు.

మిలిటరీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మల్కాజ్‌గిరి పోలీసులు సెప్టెంబరు 11న ప్రత్యేక సమాచారం మేరకు ప్రధాన నిందితుడు మల్లేష్ (A1) ను అచ్చంపేటలో మొదటగా అదుపులోకి తీసుకున్నారు. 

ఆ రోజు నుండి కోర్టు కస్టడీలో ఉంచి జరిపిన లోతైన దర్యాప్తు ఆధారంగా, ఈ కుంభకోణంలో భాగస్వాములైన కల్ కత్తాకు చెందిన ఆయుధాల బ్రోకర్లు అవి డే (A5), బీర్బల్ షా (A6) మరియు స్థానిక సహచరులు మల్లికార్జున్ (A7), నిరంజన్ (A8) లను ఈరోజు (అక్టోబర్ 3) అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితుల నుండి 04 AK-203 రైఫిళ్లు (5 మ్యాగజైన్లు), 01 ఇన్సాస్ రైఫిల్ (3 మ్యాగజైన్లు), 06 పిస్టళ్లు (9MM), 1156 రౌండ్ల పిస్టల్ బుల్లెట్లు, 720 రౌండ్ల AK-203 బుల్లెట్లు, 36 రౌండ్ల ఇన్సాస్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ముఠాకు ఎలాంటి దేశద్రోహ లేదా ఉగ్రవాద సంస్థలతో లింకులు లేవని, కేవలం దోపిడీల ద్వారా డబ్బు సంపాదించడానికే ఈ దొంగతనానికి పాల్పడ్డారని బి.సుమతి ఐపీఎస్ స్పష్టం చేశారు.

#Sidhumaroju

Alwal