బొల్లారం పీఎస్–ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్.. అక్రమ తుపాకులు స్వాధీనం.|

0
2

● అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్

● రెండు 9ఎంఎం పిస్టల్స్, డబుల్ బ్యారెల్ తుపాకీ, 17 బుల్లెట్లు స్వాధీనం

● బీహార్ నుంచి ఆయుధాలు తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు యత్నం

మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 22: మల్కాజ్‌గిరి పోలీస్ కమీషనరేట్ పరిధిలో అక్రమ ఆయుధాల విక్రయానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని మల్కాజ్‌గిరి ఎస్ఓటీ, బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

నిందితుడి నుంచి రెండు 9ఎంఎం పిస్టల్స్, ఒక డబుల్ బ్యారెల్ తుపాకీ, మూడు మ్యాగజైన్లు, 17 లైవ్ బుల్లెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వివరాలను మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్భాన్స్ కుమార్ (27) ప్రస్తుతం పటాన్‌చెరు పరిధిలోని బీహార్ బస్తీలో నివసిస్తూ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.

గతంలో చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, గంజాయి చాక్లెట్ల సరఫరా కేసులో అరెస్టయిన అతనికి నేర చరిత్ర ఉంది.

జైలు నుంచి విడుదలైన అనంతరం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ ఆయుధాల వ్యాపారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

బీహార్‌కు చెందిన సోను అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు తుపాకులు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో అవసరమున్న వారికి అధిక ధరకు విక్రయించేందుకు పర్భాన్స్ కుమార్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఈ క్రమంలో బొల్లారం పరిధిలోని బంగ్లా నెం.13, సాధన మందిర్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఎస్ఓటీ మల్కాజ్‌గిరి జోన్ బృందం, బొల్లారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిపై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన డీసీపీశ్రీధర్, ఎస్ఓటీ డీసీపీ కె. మనోహర్, ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ జి. జానయ్య, బొల్లారం ఎస్‌హెచ్‌ఓ ఎన్. రామలక్ష్మణరాజు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు సాయికుమార్, లక్ష్మయ్యతో పాటు సిబ్బందిని సీపీ బి. సుమతి ఐపీఎస్ అభినందించారు.

అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం తీవ్రమైన నేరమని, ఎవరైనా ఆయుధాల కొనుగోలు లేదా విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని సీపీ బి. సుమతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Alwal