పోలవరం వద్ద గోదావరికి పోటెత్తుతున్న వరద.. 48 గేట్లు ఎత్తివేత.

0
2

ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణలో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి తీవ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు పరిధిలోని ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 30.30 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌వే వద్ద 30.20 మీటర్లుగా నమోదైంది. వరద నీటిని నియంత్రించేందుకు అధికారులు స్పిల్‌వేకు చెందిన 48 గేట్లను ఎత్తి, 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

గోదావరి వరద ప్రభావంతో దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండిపోశమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు, సమీపంలోని దుకాణాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పి.గొందూరు నుంచి నాగులపల్లి గ్రామాల మధ్య రహదారిపైకి వరద నీరు చేరడంతో ఆలయానికి వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. నదిలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను కూడా నిలిపివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.