చల్లావారిపల్లిలో ‘పచ్చ పోసే’ మహోత్సవం వైభవం! |

0
1

నిమ్మనపల్లి: మండలంలోని చల్లావారిపల్లి గ్రామంలో చమరకాకి ఒడ్డున కొలువైన అక్కదేవతల ఆలయంలో ‘పచ్చ పోసే’ మహోత్సవాన్ని గ్రామస్థులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

 సంప్రదాయ ఆచార వ్యవహారాలతో సాగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు.

 గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మహిళలు బోనాలు, పసుపు, కుంకుమ, వేపాకులతో ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ గ్రామ వీధుల్లో గుర్రాల ఊరేగింపు నిర్వహించారు.

 

భక్తుల సందడి మధ్య సంప్రదాయబద్ధంగా ‘పచ్చ పోసే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చల్లావారిపల్లితో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.