ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రూపొందించిన ప్రతిష్టాత్మక ‘సంజీవని’ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రారంభించనున్నారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి గన్నెల గ్రామానికి చేరుకోనున్నారు. తొలుత రామకృష్ణానగర్లోని ఓ గిరిజన కుటుంబాన్ని సందర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘సంజీవని’ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి ఉండవల్లికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గన్నెల గ్రామంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు.










