గోదావరి జిల్లాల్లో అత్యంత రుచికరమైన, అరుదుగా లభించే పులస చేపల సీజన్ ప్రారంభమైంది. తాజాగా యానాం రేవులో జరిగిన వేలంపాటలో రెండు పులస చేపలు రికార్డు స్థాయి ధర పలికాయి. మొత్తం 1.300 కేజీల బరువున్న రెండు పులస చేపలను ఓ మహిళ ఏకంగా రూ.31,500కు కొనుగోలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మత్స్యకారులకు వలలో చిక్కిన ఈ పులస చేపలకు నిర్వహించిన వేలంలో మత్స్యకార మహిళ పార్వతి పాల్గొన్నారు. ఒక పులస చేపను రూ.24,000కు, మరో చేపను రూ.7,500కు కొనుగోలు చేసి మొత్తం రూ.31,500 చెల్లించారు. ఈ ఏడాది మగ పులస చేపకు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. గత నెలలో దొరికిన 1.250 కేజీల పులస చేప రూ.14,000 పలికింది.
ఈ ఏడాది వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో గోదావరికి వరదలు ఆలస్యంగా రావడం వల్ల పులస చేపల లభ్యత తగ్గినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి ఎర్రనీరు వచ్చిన సమయంలో పులస చేపలు అధికంగా లభిస్తాయి. అయితే ఈసారి వరదలు ఆలస్యం కావడంతో వలలకు తక్కువ సంఖ్యలో చేపలు చిక్కుతున్నాయి. అరుదుగా దొరకడం, అధిక డిమాండ్ కారణంగా పులస చేపల ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి.










