● మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకారం
● మోదీ నాయకత్వంతోనే దేశ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ: ఈటల రాజేందర్
● జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలి: రామచందర్ రావు
అల్వాల్, ఆగస్టు 30: మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం, నూతన జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభంలో సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమం చేపట్టారు. అనంతరం మాజీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి నుంచి గిరివర్ధన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన పార్టీ అని అన్నారు.
పార్టీ ప్రయోజనాల కంటే దేశహితానికే ప్రాధాన్యత ఇస్తుందని, బీజేపీ పవర్ ఓరియెంటెడ్ పార్టీ కాకుండా పీపుల్ ఓరియెంటెడ్ పార్టీ అని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన సమయంలోనూ దేశహితం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని ఈటల గుర్తుచేశారు. హైవేల అభివృద్ధికి చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ సడక్ యోజన వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి అంశాలను ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ, బీజేపీ జేఏసీలో భాగస్వాములుగా ఉన్నాయని ఈటల తెలిపారు. ఉద్యమ సమయంలోనే గిరివర్ధన్ రెడ్డితో తనకు పరిచయం ఏర్పడిందని, అంకితభావంతో పనిచేసే నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. మల్కాజిగిరి నియోజకవర్గం అత్యంత కీలకమైన ప్రాంతమని, జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండటంతో పాటు అధిక జనాభా కలిగిన మినీ ఇండియాగా నిలుస్తుందని అన్నారు.
పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్లని ఈటల పేర్కొన్నారు. పదవులు లభించకపోయినా సిద్ధాంతాన్ని నమ్మి పనిచేసే కార్యకర్తలను నాయకులు గౌరవించాలని సూచించారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారని, కార్యకర్తలు మాత్రం పార్టీకి శాశ్వత బలమని అన్నారు. ప్రజలు, కార్యకర్తల విశ్వాసం పొందిన నాయకులనే చరిత్ర గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.
నాయకులు మాట్లాడే విషయంలో సంయమనం పాటించాలని ఈటల సూచించారు. దెబ్బల గాయాలు మానిపోతాయని, మాటలతో కలిగే గాయాలు మాత్రం సులభంగా మానవని అన్నారు. నాయకులు నోటిలో నాలుకలా వ్యవహరిస్తూ ఆచితూచి మాట్లాడాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న నిధులను ప్రజలకు వివరించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈటల ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తున్నానని చెబుతారని, ప్రజల డబ్బుకు నాయకులు కాపలాదారులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
మోదీ బలహీనపడితే దేశ భద్రత, ప్రజాస్వామ్యం కూడా బలహీనపడతాయనే భావనతోనే ప్రజలు పలు రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఈటల పేర్కొన్నారు. భారతదేశాన్ని బలహీనపరిచేందుకు విదేశాల నుంచి ప్రతిపక్షాలకు నిధులు అందుతున్నాయంటూ ఆయన ఆరోపణలు చేశారు.
అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో అభివృద్ధి పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కమీషన్లు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారనే ఆరోపణలు చేశారు.
డ్రగ్స్ కారణంగా నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, యువతకు ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం, ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మాత్రమే సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
22-ఏ భూముల అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ చేస్తున్న పోరాటాన్ని రామచందర్ రావు అభినందించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న 22-ఏ అంశంపై మహాధర్నాకు గిరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నూతన జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ తనను తండ్రిలా నడిపిస్తున్నారని అన్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతోందని, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నానని తెలిపారు.
విద్యార్థి ఉద్యమ సమయంలో తనపై కేసులు నమోదైన సందర్భాల్లో రామచందర్ రావు అండగా నిలిచారని గిరివర్ధన్ రెడ్డి గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ ఫుల్‌టైమ్ కార్యకర్తగా పనిచేసిన రోజులను ప్రస్తావిస్తూ.. పార్టీ సిద్ధాంతం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని చెప్పారు.
తన కుటుంబం అందించిన సహకారం వల్లే రాజకీయాల్లో ముందుకు సాగుతున్నానని గిరివర్ధన్ రెడ్డి అన్నారు. తనను నమ్మి బాధ్యత అప్పగించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజిగిరిలో బీజేపీని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని, సహనం కోల్పోకుండా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దేశం, సనాతన ధర్మం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తానని గిరివర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు, గత ప్రభుత్వ అవినీతి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా కార్యాలయం వేదికగా పనిచేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో మల్కాజిగిరిలో బీజేపీని బలోపేతం చేసి కాషాయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సమన్వయం ఎంతో ముఖ్యమని, పదవిలో ఉన్న సమయంలోనే కాకుండా బాధ్యతలు పూర్తయిన తర్వాత కూడా ప్రజలు, కార్యకర్తలు గుర్తుంచుకునేలా పనిచేయాలని సూచించారు.
మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఉన్నప్పటికీ గిరివర్ధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తవారిని పార్టీలోకి తీసుకువచ్చి సంస్థాగతంగా బలోపేతం చేయాలని అన్నారు.
కాచం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గిరివర్ధన్ రెడ్డితో ఏబీవీపీలో కలిసి పనిచేశానని, అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయించే సామర్థ్యం ఆయనకు ఉందని అన్నారు. అనుభవం ఉన్న నాయకుడిగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు జయశ్రీ, కొల్లి మాధవి, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి నాయక్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి రంగారెడ్డి, తాడూరి శ్రీనివాస్, కట్టా సుధాకర్, సుధాకర్ గాండే, పాపారావు, గోపురమణరెడ్డి, జెన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, వికె మహేష్, శేఖర్, తిరుపతి యాదవ్, సుధ, భరత్, వాసు, సత్యపాల్, ఆర్.కే. శ్రీనివాస్, వడ్డేపల్లి రాజేశ్వరరావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










