● సమానత్వం, మానవత్వం, సోదరభావానికి గురుదేవుల సందేశం
● ఓణం ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక
● అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్ష
అల్వాల్, ఆగస్టు 30: వెంకటాపురం డివిజన్ ఖానాజిగూడ గ్రీన్ఫీల్డ్స్లో శ్రీ నారాయణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 172వ శ్రీ నారాయణ గురుదేవుల జయంతి, ఓణం వేడుకలకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గురుదేవుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే.. నిర్వాహకులు, కేరళ సోదర సోదరీమణులకు ఓణం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
“ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడు – మానవునికి” అనే మహోన్నత సందేశంతో శ్రీ నారాయణ గురుదేవులు సమాజంలో సమానత్వం, మానవత్వం, సోదరభావం పెంపొందించేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు.
కేరళ ప్రజలు అత్యంత పవిత్రంగా, ఆనందోత్సాహాలతో జరుపుకునే ఓణం పండుగ ఐక్యత, సౌభ్రాతృత్వం, సంతోషానికి ప్రతీకగా నిలుస్తుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గోకులం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గోకులం గోపాలన్, శ్రీ నారాయణ విద్యా సంస్థల అధ్యక్షులు పి.బి. రాఘవేంద్ర నందన్, ప్రధాన కార్యదర్శి పద్మనాభన్, కల్చరల్ సెక్రటరీ హరిదాస్, అలెక్స్, రాఘవాచారి, కే.ఆర్. మనోజ్, సెంథిల్ కుమార్, వీరారెడ్డి, ఉదయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాసులు, సురేష్, జమీందార్, సంపత్, సోమయ్య, రాము, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










