నకిలీ పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.. రూ.4.11 కోట్ల లోన్ మోసం.|

0
24

● 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు

● కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్ అరెస్ట్

● ఆరు కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. డీసీపీ శ్రీధర్

ఆల్వాల్, సెప్టెంబర్ 2: నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించడంతో పాటు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన కేసులో కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆరు వేర్వేరు క్రిమినల్ కేసుల దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు.

రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు, డాక్యుమెంట్ రైటర్లు, జీపీఏ హోల్డర్లు, నకిలీ విక్రేతలతో కలిసి ఈ వ్యవహారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ వివరించారు. ముందుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులను గుర్తించి, వారి పేర్లతో నకిలీ లేదా తారుమారు చేసిన స్థిరాస్తి పత్రాలను సిద్ధం చేసేవారని పేర్కొన్నారు.

ఆ పత్రాలను ఆధారంగా చేసుకుని వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి గృహ రుణాలు పొందేవారు. రుణం మంజూరైన తర్వాత బ్యాంకులకు అనుమానం రాకుండా కొంతకాలం ఈఎంఐలు సక్రమంగా చెల్లించి, అనంతరం ఉద్దేశపూర్వకంగా చెల్లింపులు నిలిపివేసేవారని దర్యాప్తులో వెల్లడైంది.

రుణాలు బకాయి పడటంతో బ్యాంకులు ఆస్తులకు డిఫాల్ట్ నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించగా అసలు విషయం బయటపడింది. కొన్ని ఆస్తులు వాస్తవంగా లేవని, మరికొన్నింటికి సంబంధించిన సర్వే, ప్లాట్ నంబర్లు తారుమారు చేసినట్లు గుర్తించారు.

ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో అప్పట్లో కీసర సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన మహమ్మద్ యూసఫ్ రెహమాన్ నిబంధనలను పట్టించుకోకుండా అనుమానాస్పద పత్రాలను ఆమోదించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారం ద్వారా నిందితుల ముఠా 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు నిర్వహించి బ్యాంకుల నుంచి మొత్తం రూ.4.11 కోట్లను పొందినట్లు డీసీపీ శ్రీధర్ వెల్లడించారు.

కీసర పోలీస్‌స్టేషన్ క్రైమ్ నంబర్ 928/2025 దర్యాప్తులో భాగంగా 2021 నుంచి 2022 మధ్య అక్రమంగా రిజిస్టర్ అయిన ఆరు సేల్ డీడ్‌లను పోలీసులు గుర్తించారు. డీడ్ నంబర్లు 2843/2021, 5108/2021, 7328/2021, 14203/2021, 13839/2022, 14531/2022గా ఉన్నట్లు తెలిపారు. ఈ పత్రాలను రుణాల కోసం తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుంచి నిధులు పొందినట్లు దర్యాప్తులో తేలింది.

రెహమాన్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను పంచుల సమక్షంలో సేకరించిన పోలీసులు రిజిస్ట్రేషన్ పత్రాల ప్రతులతో పాటు ఇతర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

కీసర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఒరిజినల్ రికార్డులు, సేల్ డీడ్లు, జీపీఏ, ఏజీపీఏ పత్రాలు, బయోమెట్రిక్ వివరాలు, వేలిముద్రలు, లోన్ ఫైళ్లు, నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఈ నెట్‌వర్క్‌లో ఉన్న మిగతా వ్యక్తులను గుర్తించడంతో పాటు మోసం ద్వారా ఆర్జించిన నగదు, ఆస్తుల రికవరీపై దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ శ్రీధర్ తెలిపారు.

స్థిరాస్తులు కొనుగోలు చేసే వారు, రుణాల కోసం ఆస్తులను తాకట్టు పెట్టే సమయంలో టైటిల్, లింక్ డాక్యుమెంట్లు, సర్వే నంబర్లు, ప్లాట్ వివరాలను అధికారిక రికార్డులతో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని డీసీపీ ప్రజలకు సూచించారు.

#Sidhumaroju

#Alwal