భూ కుంభకోణంలో మాజీ సబ్‌రిజిస్ట్రార్ అరెస్ట్.|

0
1

● నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు

● ఏ9 నిందితుడిగా మహమ్మద్ యూసఫ్ రెహమాన్

● ఆరుగురు ప్రధాన నిందితుల అరెస్ట్.. కొనసాగుతున్న దర్యాప్తు

ఆల్వాల్, సెప్టెంబర్ 2: నకిలీ పత్రాలు సృష్టించి, నకిలీ యజమానుల పేర్లతో భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్‌ను కీసర పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన భూ మోసం కేసులో రెహమాన్‌ను ఏ9 నిందితుడిగా చేర్చారు.

నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 404, 405లో ఉన్న ఖాళీ స్థలాన్ని నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు.

ధర్మారావు అనే నకిలీ యజమాని పేరుతో ఫోర్జరీ లింక్ డాక్యుమెంట్లు రూపొందించి, వాటి ఆధారంగా ఆస్తిని పలువురి పేర్లపై మార్చుకుంటూ రిజిస్ట్రేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో అప్పట్లో సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన మహమ్మద్ యూసఫ్ రెహమాన్ పత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ శ్రీధర్ తెలిపారు.

ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డి, జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వరరావుతో పాటు మొత్తం ఆరుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

వారి విచారణలో లభించిన సమాచారం ఆధారంగా మాజీ సబ్‌రిజిస్ట్రార్ ప్రమేయాన్ని నిర్ధారించినట్లు డీసీపీ పేర్కొన్నారు.

భూ రికార్డుల వెనుక ఉన్న మరికొందరు లబ్ధిదారులు, ఇతరుల పాత్రపైనా కీసర పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#Sidhumaroju

Alwal