ఇస్కదామెర్ల KVR కాలనీలో భూ వివాదం.. న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని KVR కాలనీలో భూ వివాదం నెలకొంది. తమకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఇతరులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు 2.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ స్థలాల్లో డి. రాజశేఖర్, కె. మల్లికార్జున, డి. మస్తాన్, వి. మాధవరావు, వి. మురళి, పి. కొండయ్య, పి. మునెబాబు, డి. పద్మ, డి. నరసింహులు, వి. కొండలరావు, ఎన్. కుమారి, ఎస్. బిక్షపతి, వి. ఆదెమ్మ, వి. మాల్యాద్రి తదితర కుటుంబాలు నివసిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో తమకు కేటాయించిన స్థలాల్లో అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే అంశంపై వివాదాలు, గొడవలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు.
“మాకు పట్టా ఉన్న స్థలంలో వేరే వాళ్లు ఇళ్లు కడితే మేము ఎక్కడ ఉండాలి?” అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తమ స్థలాలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ సమస్యపై ఎమ్మార్వో, తహసీల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు KVR కాలనీ వాసులు తెలిపారు.










