ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలతో చంద్రబాబు రేపు కీలక భేటీ. |

0
2

ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలుతో పాటు కరవు భత్యం బకాయిలు తదితర కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు.

నిన్న సచివాలయంలో ఏపీ జేఏసీ నాయకులు ఎ. విద్యాసాగర్, డీవీ రమణ, భారతీ ప్రసాద్ తదితరులు సీఎం చంద్రబాబును కలిశారు. ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలను, ఆర్థికేతర సదుపాయాల పెండింగ్ అంశాలను విద్యాసాగర్ సీఎంకు వివరించి, తక్షణ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి… ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అత్యంత కట్టుబడి ఉందో స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు అందాల్సిన న్యాయమైన ప్రయోజనాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.