బాపట్ల కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ఉద్యోగులు తమ పెండింగ్ బకాయిలు, న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, పీఆర్సీ, మధ్యంతర భృతి (ఐఆర్), ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. తమకు రావాల్సిన బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన దశలవారీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా బాపట్ల జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలిపారు. అలాగే వాట్సాప్ డీపీలు, స్టేటస్‌ల ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జేఏసీ నాయకులు కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి దశలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.










