రాయచోటిలో ముగ్గురు మంత్రుల కీలక సమీక్ష

0
3

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో రాయచోటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్న మంత్రులు.. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను సూచించారు.

అలాగే రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజలతో నిరంతరం మమేకం కావడం వంటి అంశాలపై చర్చించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

రాయచోటి అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సమష్టిగా పనిచేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.