ఆసిఫాబాద్‌లో ఘోర ప్రమాదం.. లెక్చరర్ తేజస్విని మృతి

0
3

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పెళ్లయిన కొద్దిరోజులకే జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పార్ట్ టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న బండే తేజస్విని (26) అనే యువతి మృతి చెందడంతో ఆమె పుట్టింటి, అత్తింటి కుటుంబాలలో తీరని శోకం నెలకొంది.

కళాశాలకు వెళ్తుండగా ప్రమాదం: బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తేజస్విని తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ తేజస్విని కన్నుమూశారు.

తీరని నష్టం – కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు: గత జూలై 5వ తేదీన తిరుపతి – తేజస్వినిల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే, అదీ విధి నిర్వహణకు వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగి తేజస్విని మరణించడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురుకుల కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ఇంత చిన్న వయసులోనే నిండు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ తీవ్రంగా కలచివేసింది.