మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన పవన్ కల్యాణ్.

0
2

ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామంలోని మైసమ్మ చెరువు గట్టుపై వెలసిన మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గ్రామీణ చెరువులకు సరికొత్త రూపునిచ్చే బృహత్తర కార్యక్రమంలో భాగంగా రూ. 73 లక్షల వ్యయంతో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రజలకు అంకితం చేశారు.

 

గ్రామాల్లోని చెరువులను కేవలం నీటి వనరులుగా కాకుండా, ప్రజలందరికీ ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచే సామాజిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తెలిపారు. ఫకృద్ధీన్ పాలెంలోని మైసమ్మ చెరువును రాష్ట్రానికే ఒక మోడల్‌గా అభివృద్ధి చేసినట్లు వివరించారు. చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పిల్లల పార్కును ఆయన ప్రారంభించారు. చెరువు గట్టుపై కలియదిరుగుతూ, అక్కడి వృక్షాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వరుడి సహిత శివుని విగ్రహాన్ని పరిశీలించారు.