గ్రామీణ ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది ఆర్ఎంపీ వైద్యుడే

0
1

 

 

🟢వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఎంపీల సమస్యలపై నా వాణి వినిపిస్తా: ఎమ్మెల్యే మాలకొండయ్య

 

నందిగామ , సెప్టెంబర్ 25 Bharath Aawaz :అనుభవ సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ, పీఎంపీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని బృందావన్ కళ్యాణ మండపంలో ఆర్ఎంపీ వైద్యుల రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు. ఫెడరేషన్ అధ్యక్షుడు యామర్తి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, కార్యదర్శి కరెళ్ల గణపతిరావు సభా పరిచయం చేశారు.

 

సభకు ముఖ్య అతిథిగా హాజరైన చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ పగలనకా, రాత్రనకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించే క్రమంలో ముందుగా గుర్తుకొచ్చేది ఆర్ఎంపీ వైద్యుడేనని అన్నారు. తాను కనిగిరిలో నిర్వహించిన మెడికల్ క్యాంప్‌ను సుమారు 15 వేల మంది ప్రజలు వినియోగించుకున్నారని, క్వాలిఫైడ్ వైద్యులకు ఆర్ఎంపీ వైద్యులు అందించిన సహకారం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

వృత్తితో పాటు ప్రజాహిత కార్యక్రమాల్లోనూ ఆర్ఎంపీ వైద్యులు చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఎంపీ వైద్యుల సమస్యలపై తన వాణిని వినిపిస్తానని సభా వేదికగా ప్రకటించారు.

ఫెడరేషన్ గౌరవ సలహాదారు లంక దాసరి ప్రసాదరావు మాట్లాడుతూ ఆర్ఎంపీ వైద్యులు అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందుతున్నప్పటికీ, వైద్యం అందించే తీరుపై కొన్ని విమర్శలు వస్తున్నాయని అన్నారు. జ్వరం వంటి సాధారణ లక్షణాలకు అవసరానికి మించి పరీక్షలు చేయించడం, అధిక శక్తి యాంటీబయోటిక్స్‌ను ఇంజెక్షన్లు లేదా మందుల రూపంలో వినియోగించమని సూచించడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులు, వాటికి దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, ఎవరికీ హాని కలగకుండా బాధ్యతాయుతంగా ప్రాథమిక వైద్య సేవలు అందించాలని కోరారు.

2,200 మంది హాజరు

ఈ రాష్ట్ర మహాసభకు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,200 మంది ఆర్ఎంపీ వైద్యులు, ఫెడరేషన్ నాయకులు హాజరయ్యారు. ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు కోలా వెంకటేశ్వరరావు, కోశాధికారి సి.ఎస్. కుమార్, కాటూరి వరప్రసాద్, కరెళ్ల ముక్తేశ్వరరావు, దాసు వెంకట నాగేశ్వరరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు, డివిఎస్ రాజు, గళ్లా మురళి తదితరులు పాల్గొన్నారు.