పది ఎకరాల భూదానం.. వేలాది ఆడబిడ్డల భవిష్యత్తుకు పునాది

0
3

పది ఎకరాల భూదానం.. వేలాది ఆడబిడ్డల భవిష్యత్తుకు పునాది

🟧వసంత నాగేశ్వరరావు దాతృత్వం నేటికీ వేలాది కుటుంబాలకు వెలుగునిస్తోంది

 

🟡–: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

 

▶️నందిగామ: నందిగామ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాజీ హోం, నీటిపారుదల శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు చిత్రపటాన్ని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆవిష్కరించారు. కూటమి నాయకులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బందితో కలిసి ఆయన సేవలను, దాతృత్వాన్ని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నందిగామలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు వసంత నాగేశ్వరరావు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మహిళలకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు.

ఉచితంగా స్థలం అందించే ప్రాంతాల్లో కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సమయంలో నందిగామ ఆడబిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వసంత నాగేశ్వరరావు 10 ఎకరాల విలువైన భూమిని ఉచితంగా దానం చేయడం గొప్ప దాతృత్వానికి నిదర్శనమని సౌమ్య కొనియాడారు.

ఆ భూదానం ఫలితంగానే నేడు వేలాది మంది విద్యార్థినులు సాంకేతిక విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధిస్తున్నారని అన్నారు. అదే ప్రాంగణంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా పేద మహిళలు కుట్టుపని తదితర నైపుణ్యాలను నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

“వసంత నాగేశ్వరరావు చేసిన పది ఎకరాల భూదానం కేవలం భూమి దానం కాదు.. వేలాది ఆడబిడ్డల భవిష్యత్తుకు వేసిన గట్టి పునాది. ఆయన నాడు చల్లిన విత్తనం నేడు మహావృక్షంగా మారి ఎందరో ఆడబిడ్డలకు విద్యా నీడను అందిస్తోంది” అని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.