యూట్యూబ్ పిచ్చి.. బంగారం కోసం పాడుబడ్డ గనిలోకి.. రక్షించిన పోలీసులు.

0
4

యూట్యూబ్ వీడియోలను నమ్మి నిధి కోసం ఆశపడటం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ పాడుబడిన బంగారు గనిలో నిధి ఉందని నమ్మి, అందులోకి దిగి చిక్కుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. చివరికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అతడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి (52), కిష్టయ్య అనే ఇద్దరు స్నేహితులు సులభంగా ధనవంతులు కావాలనే ఆశతో రామగిరికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పాత బంగారు గనుల్లో బంగారం దొరుకుతుందంటూ యూట్యూబ్‌లో వచ్చిన కొన్ని వీడియోలను చూసి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో ప్రభాకర్ రెడ్డి ఒక తాడు సాయంతో పాడుబడ్డ గని లోపలికి దిగాడు.

లోపలికి వెళ్లేకొద్దీ చిమ్మచీకటిగా మారడం, గాలి ఆడకపోవడంతో ప్రభాకర్ రెడ్డి తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. పైకి రావడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. బయట ఉన్న మిత్రుడు కిష్టయ్య కూడా అతడిని పైకి లాగలేకపోయాడు. పరిస్థితి విషమించడంతో కంగారుపడిన కిష్టయ్య, వెంటనే సమీపంలోని రామగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గనిలో చిక్కుకున్న ప్రభాకర్ రెడ్డిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.