మంచిర్యాల జోన్ పరిధిలోని హాజీపూర్ పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్ఐ కిరణ్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని డీసీపీ సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.










