విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం కనకదుర్గమ్మ వారు ‘శ్రీ మహాచండి దేవి’ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ విశేష రూపంలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు.
మహాచండి దేవి దర్శనార్థం బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ‘జై దుర్గ.. జై జై దుర్గ’ అనే నామస్మరణలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మార్మోగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
పురాణాల ప్రకారం, దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి (త్రిశక్తి)ల ఏకైక స్వరూపంగా శ్రీ మహాచండి దేవి ఆవిర్భవించిందని పండితులు పేర్కొంటున్నారు.










