మొగిలిపాడు పెట్రోల్ బంక్ సమీపంలో అమానవీయ ఘటన
నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్
పలాస పురపాలకం, మొగిలిపాడు:
పలాస పురపాలక పరిధిలోని మొగిలిపాడు ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పుట్టిన కొద్ది గంటలే అయినట్లు భావిస్తున్న ఓ నవజాత శిశువు మృతదేహం మురుగు కాలువలో కనిపించడం స్థానికుల్లో తీవ్ర ఆవేదనకు కారణమైంది.
స్థానికుల వివరాల ప్రకారం, మొగిలిపాడు సమీపంలోని పెట్రోల్ బంకు పక్కన ఉన్న చికెన్ దుకాణం వద్దనున్న మురుగు కాలువలో గురువారం ఉదయం ఓ పసికందు మృతదేహాన్ని గుర్తించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పుట్టిన వెంటనే శిశువును కాలువలో పడవేసిన ఘటనపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శిశువును కాలువలో పడవేసిన వ్యక్తులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాధ్యులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.










