పలాస మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించాలి: సభాముఖంగా శ్రీపద్మ పిలుపు

0
1

పలాస:

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైఎస్సార్‌సీపీ నాయకురాలు తాళాసు శ్రీపద్మ పిలుపునిచ్చారు. స్థానికంగా నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు.

డాక్టర్ అప్పలరాజు, జగన్‌మోహన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు:

వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అందించిన ప్రోత్సాహంతోనే తాము రాజకీయాల్లోకి వచ్చామని ఆమె గుర్తుచేసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తమ కుటుంబం చార్టర్డ్ అకౌంటెంట్‌గా, లా ప్రాక్టీస్‌లో ఉన్న సమయంలో 2017–18లో డాక్టర్ అప్పలరాజు ఆహ్వానం మేరకు రాజకీయ ప్రవేశం చేశామన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ భర్త టి.వి. సతీష్‌కు వరుసగా రెండుసార్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవిని కట్టబెట్టి వైశ్య సామాజిక వర్గానికి, స్థానిక జీడిపప్పు వర్తక వ్యాపారులకు ఎంతో మేలు చేశారని కొనియాడారు.

అధికార దర్పం ప్రదర్శించను – కలిసికట్టుగా పనిచేస్తా:

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమకు లభించిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని, ఎలాంటి అధికార దర్పం ప్రదర్శించబోనని ఆమె స్పష్టం చేశారు. 36 వార్డుల్లోని కౌన్సిలర్లందరినీ చైర్‌పర్సన్‌లుగానే భావిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారంలో వారి నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

కార్యకర్తలకు అండగా ఉండి తిరిగి పూర్వవైభవం సాధిస్తాం:

2024 ఎన్నికల అనంతరం అనుకోని పరిస్థితుల్లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ శ్రేణులు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ… ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా తిరిగి ప్రజల మద్దతును నిరూపించుకోవాలన్నారు. తక్కువ సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ సమన్వయంతో వార్డుల్లో ముమ్మర ప్రచారం చేసి, డాక్టర్ అప్పలరాజు మరియు జగన్‌మోహన్‌రెడ్డిల నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.