విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం, అమ్మవారి జన్మనక్షత్రమైన ‘మూలా నక్షత్రం’ కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారు జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు జనసంద్రంగా మారాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అన్ని రకాల సిఫార్సు దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులందరికీ కేవలం ఉచిత దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మూడు చోట్ల హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి, ఐదంచెల భద్రత నడుమ భక్తులను క్రమపద్ధతిలో క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు సాంకేతికత సాయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేస్తున్నారు.
నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.










