ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి) ఆధివాసీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలకు నిధులు మంజూరు చేయించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంస్కృతిని కాపాడుకునేందుకు దండారి ఉత్సవాల నిర్వహణ కొరకు ప్రత్యేకంగా ‘దండారి కమ్యూనిటీ షెడ్స్’ను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుండి మంజూరు చేయాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోయం బాబురావు గారు మరియు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు గౌరవ మంత్రి గారిని కోరారు.
దీనిపై గౌరవ మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పూర్తి జాబితాను తెప్పించుకుని దండారి (గుస్సాడి) షెడ్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ శ్రీ భోజరెడ్డి గారు, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు శ్రీ జాదవ్ నరేష్ గారు, ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ సాజిద్ ఖాన్ గారు మరియు ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.










