అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదు
కాశీబుగ్గ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ, మతపరమైన అంశాల నేపథ్యంలో శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు కాశీబుగ్గ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి. వెంకట రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ యాక్ట్, 1861లోని 30, 31 సెక్షన్ల ప్రకారం అక్టోబర్ 12 నుంచి 31వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కాలంలో కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించే ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు, సంస్థలు సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, బంద్లు నిర్వహించే అవకాశం ఉందని, ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాంటి అవాంఛనీయ ఘటనలను నివారించి ప్రజా ప్రశాంతతను కాపాడటమే ఆంక్షల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కాశీబుగ్గ, కాశీబుగ్గ రూరల్, సోంపేట, ఇచ్చాపురం ప్రాంతాల్లోని సంబంధిత పోలీస్ అధికారులకు ఉత్తర్వులపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై పోలీస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్లతో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










